అనన్యభక్తి - ఆత్మార్పణ
''జగన్మాతయందు మనకు అనన్యభక్తి కల్గిన, ఆమె అద్వైతముక్తినిచ్చుననుట తథ్యము. ఆదిశంకరులు. సౌందర్యలహరిలో అంబిక నిట్లు వర్ణించిరి.
భవాని! త్వం దాసే మయి నితర దృష్టిం సకరుణా
మితిస్తోతుం నాంఛన్ కథయతి భవాని త్వమితి యః,
తదైవ త్వం తసై#్మ దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుంద బ్రహ్మేంద్రస్ఫుట మకుటనీరాజిత వదామ్||
'శివా భవానీ రుద్రాణీ శర్వాణీ సర్వమంగళా' - యని అమరము. ఇందు భక్తుడు 'తల్లీ! నీకింకరుడనగు నన్ను దయచూడుము' అన్న ప్రార్థనను, 'భవానిత్వం' అను పదములతో ప్రారంభించును. భవాని త్వం అనుటకు - 'భవాని' ్స 'నీవు' అను అర్థమేగాక, 'నేను నీవు అగుదుముగాక' (భవాని, భవాన, భవాను) అను అర్థముకూడ కలదు. భక్తునియందు జగన్మాత కటాక్ష మెట్టిదనిన, ఆమె భక్తుని ప్రార్థనను సాంతముగా వినక అతని నోటినుండి మాట వచ్చినదో లేదో (భవాని త్వం అనుమాట) సాయుజ్యమును ఆక్షణమే ఇచ్చునట. అతడు ప్రార్థించినది ఆమె కరుణాదృష్టిని, ఆమె యిచ్చినది సాయుజ్యమును, అతడు దాని నెన్నడు ఎదురుచూడలేదు. పరిపూర్ణమగు భక్తియొకనికి ఉండిన అతనికి ఆయాచితములగు వస్తువులు సైతము లభించునని ఇందలి భావము. ఇందు ప్రార్థకునకు లభించిన సాయుజ్యము సముద్రమును చేరిన అది ఎట్లు శాంతిబొందునో, అట్టిశాంతిని బోలినది. నదులు వేగవంతములై కొండచరియల నుండి సంతోషముతో క్రిందికి దుముకుచు చదునునేలలో ఉరవడులతో, పరవడులతో, సమృద్ధములై ప్రవహించును. కాని అవి సముద్రమును చేరినగాని శాంతి పొందవు. భక్తుని సాయుజ్యమును అట్టిదే. ద్వైతభావముతో దాస్యభావముతో సాధకుడు ప్రారంభించి అంబికా కటాక్షవీక్షణమున ఆమెతో నేకమగును. తద్వారా శివసాయుజ్యము పొందును. అదియే మోక్షము.
పై చెప్పినరీతిగా అనన్యభక్తికల్గియుండుటేగాక, పారమార్థిక జీవనమున మనోవృత్తులును, పలుకును పాటును పరిశుద్ధ పరచుకొనవలయును. సమర్థ రామదాసు, తులసీదాసు, అప్పయదీక్షితులు, తాయుమానవర్‌స్వామి ఇత్యాది మహాత్ములు దైవభక్తి అపరిమితముగా కల్గియుండుటయేగాక, కాలమంతయు సత్కార్యములను చేయుటయందే వినియోగించిరి. వారు వ్రాసిన గ్రంథములు భక్తిపూరితములై, వేదాంతబోధకములై, ఉత్తేజకరములై ఈనాటికి వర్థిల్లుచున్నవి. రామదాసు వ్రాసిన దాసబోధనము, తులసీదాసు వ్రాసిన రామ చరితమానసము ఈ తెగకుచెందిన భక్తిగ్రంథములు. ఈ మహాత్ములు ఒక చెడుతలపు దలచిగాని, ఒక చెడ్డ కార్యము చేసిగాని ఎరుగరు.
మన జీవితములనుండి చెట్టను తొలగించవలెనని మనమెంత ప్రయత్నించినను, ఈ యత్నమే చెడ్డను జ్ఞప్తికి దెచ్చి దానికి లొంగిపోవునట్లు చేయును. కాని మహాత్ములు సదా ఏదో సత్కార్యమును చేయుచునే యుండుటచే వారికి చెడ్డను గూర్చి తలచుటకు ఒక నిముసమయినను తెరపిలేకుండెడిది. ఒక సన్యాసిని, 'మీరు 'కామమును ఎట్లు జయించితిరి?' అని ఎవరో అడిగిరట. కామము నా మనోద్వారముకడకు వచ్చి తలుపు తట్టినపుడు నేను ఏదోయొక కార్యమున నిమగ్నుడనై యుండుటచే దానికి విసుగుబుట్టి తిరిగిపోయెడిది' అని ఆయన బదులు చెప్పెనట.
నిరుద్యోగమగు మనసు వృథా భాషణములను చేయ నిచ్చగించును అంతటితో నితరులనుగూర్చి దూషణ ప్రారంభమగును. కామాదులు తలెత్తును. సత్కార్యాచరణము చేయుచున్నచో చెడుతలపులు పుట్టవు. దుస్సాంగత్యమను వ్యాధికి సత్సాంగత్యమే చికిత్స.
వర్తన చక్కబడుటకు నిరంతర సత్కార్యాచరణ మవసరము. అపుడు చెట్టయనుచెట్టు వ్రేళ్లతో సహా ఎండిపోయి సమూలముగా నశించును. దురాలోచనలకు ఎడమీయ గూడదు. వట్టి ధ్యానజపాదులతో ప్రయోజనము లేదు. అదియును ఒక వాడుకగా అయిపోయి మనస్సును సంస్కరించక కలుషమునకు లొంగునట్లుచేయును. మహాత్ముల చరిత్రలు స్వయముగా వ్రాయుటయందుగాని లేక చూచివ్రాయుట యందుగాని కాలము గడుపుట మంచిది. అపుడు మనలను కళంకితులుగా చేయుటకు కలుషమునకు వీలుండదు. అప్పయ దీక్షితులు కంచి వరదరాజస్వామి సంబోధించుచు నిట్లు వ్రాసిరి:
మన్యే సృజం త్యభినుతిం కవిపుంగవాస్తే
తేభ్యో రమారమణ ! మాదృశ ఏవ ధన్యః!
త్వదర్ణనే ధృతరసః కవి తాతి మాంద్యా
ద్య స్త త్తదంగ చిరచింతనభాగ్య మేతి||
''ప్రభూ ! అతి త్వరితగతిని నీపై కవనమల్లెడు శక్తి గల యితర కవులున్నను ఉండవచ్చును. కాని నేనొక మందుడను. ఐనప్పటికిని వారికంటె నేనే ధన్యుడను అని అనుకొందును. ఏలన, నీ వర్ణనను కవితాగుంభనము చేయలేక ముందు వెనుక ఆడుచున్నప్పుడు నీ అంగచింతనాభాగ్యము నాకు వారికంటెను మరింత ఎక్కువగా లభించుచున్నది.' ఇట్లు మహాత్ముల చరిత్ర మనకు సత్కార్యాచరణ అవసరమని తెలుపును.
సత్కార్యములు చేయుట అనునది ఆధ్యాత్మిక జీవనమున కొక అంగము. దీనితో పాటు పరమేశ్వరునికి మనము పరిపూర్ణముగా ఆత్మార్పణము చేయవలెను. సుషుప్తియందు మనలను ఏవిషయమును బాధించుటలేదు. నిదురనుండి లేచినదే తడవు మన చింతలన్నియు మనలను ఆవరించును. దేహము, మనస్సు, సమాజము, ప్రభుత్వము, దేశము - మన జీవితమున ప్రతి యొక్క విషయమునకును సంబంధించిన చింతలు ఎడతెగి సుషుప్తిలో మనలను ఎట్లు బాధించవో, అట్టినిర్బాధాకరమగు స్థితిని జాగ్రదవస్థలోనికి సహితము మనము తేగల్గిన నదియే మోక్షము. దేశ కాలములందు దూరముగ నున్న వారినిగూర్చిన చింతలు మనలు అంతగా బాధించవు. కొన్ని సంవత్సరముల క్రితము జరిగిన సంతాపకరములగు విషయముల స్మృతి నేను పెద్దగా మనలను కలవరపెట్టదు. విచారమెట్టిదైనను, దుఃఖమెంత తీవ్రతరమయినను, మన విధులను మనము నిర్వర్తించవలెనని జ్ఞానశిఖరములనదగు ఉపనిషత్తులు మనకుబోధించును.
ఉపనిషత్తులలో చాంద్రాయణము, పంచాగ్నిమధ్యము అని ఎన్నో తపస్సులు చెప్పబడినవి. కాని అవి సాధారణుల కసాధ్యములు. వానికి గొప్ప తితీక్ష యవసరము. అందుచే బృహదారణ్యకము, వానికి బదులు మరియొక విధమగు తపస్సును గూర్చి చెప్పును. 'ఎన్నడైన నీకు శరీరమున జబ్బు చేసిన, ఆ వ్యాధిని ద్వేషించక, ధృతితో ఓర్చుకొమ్ము. ఈ వ్యాధి సైతము, దైవనియుక్తమగు తపస్సుగా లెక్కించుము. వైద్యులు జబ్బుచేసినపుడు పథ్యమును విధింతురు. అదియొక విధమైన తపస్సే'. వేళయు వ్యవస్థయు లేక కనబడిన దంతయు తినెడి అలవాటు కల్గినవారికి ఇది యొక నియమము. తాత్కాలిక నియమము.
ఆదిశంకరులు ఈభావమునే గ్రహించి యొకశ్లోకమును వ్రాసిరి. చేయునది సర్వము - మంచి చెడ్డ అన్నియు - భగవదర్పితముచేసి దీనిని నాచేయు పూజగా గ్రహించుమని దేవుని ప్రార్థించుటను అది బోధించును.
ఆత్మా త్వం గిరిజామతిః ప్రియజనాః ప్రాణాః శరీరంగృహం
పూజా తే విషయోవభోగరచనా నిద్రా నమాధిస్థితిః,
సంచారః పదయోః ప్రదక్షిణవిధి స్తోత్రాజి సర్వా గిరః
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవారాధనమ్|
ఓ శంభూ ! నీవు నా ఆత్మవు. గిరిజయగు పార్వతి నా మతి. నాప్రాణములే నీ ప్రియజనములు. నాశరీరమే నీగృహము. నేను అనుభవించు విషయములే నీపూజాదికములు. నానిద్రయే సమాథి. నేను చేసెడి సంచారమే నీకు ప్రదక్షిణము. నేను మాటాడునదంతయు నీస్తోత్రములే. నేను చేసెడి ప్రతికర్మయు తండ్రీ నీ ఆరాధనమే!
ఇట్లు సర్వమును ఈశ్వరార్పణ చేయుట మహోన్నత పూజావిధి యని ఆచార్యులు సెలవిచ్చిరి.
సారమార్థిక జీవనమునకు - అనన్య భక్తి. నిరంతర సత్కార్యాచరణము, ఆత్మార్పణము అనునవి అత్యవసరములగు అంగములు. సర్వకర్మలను ఈశ్వరార్పితముచేసి మనము జీవితములను గడపవలెను.
|